.webp)
సైబర్ నేరగాళ్ల బారిన పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ రాంనగర్లో జరిగింది. లోన్ యాప్ ముసుగులో జరిగిన న్యూడ్ మార్ఫింగ్ బ్లాక్మెయిల్ ఫోటో కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన 36 ఏళ్ల ప్రేమ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.
కొద్ది రోజుల క్రితం ప్రేమ్ కుమార్‌కు వాట్సాప్ ద్వారా తక్షణ లోన్ ఇస్తామంటూ ఓ మెసేజ్ వచ్చింది. అవసరం ఉండటంతో అతడు స్పందించి, లోన్ యాప్‌కు సంబంధించిన వ్యక్తులకు తన ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలను పంపించాడు. అయితే, లోన్ ఇవ్వకుండా అతని ఫోటోను దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాళ్లు ప్రేమ్ కుమార్ ఫోటోను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలుగా మార్చి, వాటిని వాట్సాప్ ద్వారా అతనికి పంపించారు. వెంటనే డబ్బులు చెల్లిస్తే.. ఆ ఫోటోలు, వీడియోలను అతని బంధువులు, కుటుంబ సభ్యులు, పరిచయస్తులకు పంపిస్తామని బెదిరించారు.
అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పంపుతూ మానసికంగా వేధించారు. ఈ పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రేమ్ కుమార్ విష యం తన భార్య, కుటుంబ సభ్యులకు చెప్పారు. ఫోటోలు నిజమైనవి కావని, భయపడాల్సిన అవసరం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేద్దామని కుటుంబ సభ్యులు అతడికి ధైర్యం చెప్పారు. డబ్బులు చెల్లిస్తే సమస్య తీరదని, మరింతగా డిమాండ్ చేస్తారని కూడా హెచ్చ రించారు.
కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారు, లోన్ యాప్ సైబర్ నేరగాళ్ల నుంచి బెదిరింపులు కొనసాగుతుండటం, అసభ్య మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ రావడంతో ప్రేమ్ కుమార్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. చివరకు వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ్ కుమార్ మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లోన్ యాప్ వెనుక ఉన్న నిందితుల వివరాలను సేకరిస్తూ, సైబర్ విభాగం ప్రత్యేకంగా విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
