జనవరి 22, 2026 5:38PMన పోస్ట్ చేయబడింది

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆస్తిపంజరం కలకలం రేపింది. భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి లగేజీలో అస్థిపంజరం కనిపించడంతో అంతా అప్రమత్తమయ్యారు. టెర్మినల్–3 వద్ద గురువారం (జనవరి 22) బ్యాగేజీ స్కానింగ్ జరుగుతున్న సమయంలో ఈ అస్థిపంజరం బయటపడింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో.. ఆ బ్యాగ్ ఢిల్లీ నుంచి ప్రయాణిస్తున్న ఒక వైద్య విద్యార్థికి చెందినదిగా పేర్కొన్నారు.
బ్యాగులో ఉన్నది వైద్య విద్యలో ఉపయోగించే డెమో అస్థిపంజరం అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఎలాంటి నేరానికి సంబంధం లేదని, అనుమానాస్పద పరిస్థితులు లేవని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అయినప్పటికీ అది మనిషి అస్థిపంజరమా లేదా విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగించే నమూనా అనే విషయాన్ని పూర్తిగా నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత నిజనిజాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
