2009, నవంబర్ 29వ తేదీ.. పేరున్న ఓ పేపర్ల జర్నలిస్టుగా పంజేస్తున్న రోజులు. రోజు రాత్రి పదకొండయ్యేది ఇంటికి వొయ్యేసరికి. మా ఇంటికాడనే బుక్కెడంత బువ్వ దినివొయి పెద్దమ్మొళ్లింటికాడ పండుకునుడు నాకలవాటు. పెద్దమ్మొళ్ల ఇంటికాన్నే పండుకునుడెందుకంటే? మా ఇల్లు ఇరుకుటం ఉండటం ఒక్క కారణమైతే, పెద్దమ్మొళ్ల ఇల్లు లంకంత ఉండటం, ఆ లంకంత కొంపల ఇద్దరే ఇద్దరు పెద్ద మనుషులుండటం ఇంకో కారణం. పెద్దమ్మొళ్ల ఇల్లు మా ఇంటి కాన్నుంచి కొంచెం దూరం ఉంటుంది. ఒంటరిల్లు, ఎదురంగనే శ్మశానం. రాత్రిపూట పెద్దమ్మ, పెద్దబాపుకేమన్నయితెట్ల? అని నాడే ఆలోచన జేసి, ఏ నాత్రయినా వాళ్లింటికి వొయ్యి పండుకునేది. నేను వొయ్యేదాంక వాళ్లుగూడ నిద్రవోకపొయ్యేది. నా నడక సప్పుడిని నేన్ వొయ్యేసరికి తలుపు దీస్తుండె పెద్దబాపు. ఇంతకూ పెద్దబాపు పేరు చెప్పలేదు గదా? గడ్డం మల్లయ్య, సన్నాఫ్: పెద్ద వెంకయ్య (మా తాత). మాటకు ఎనమందుగురు కొడులైతే.. అందరికన్న పెద్ద ఈ మల్లయ్య పెద్దబాపే. నేనే నాత్రి వొయ్నా… ఆ అద్దుమనాత్రి గూడ ‘తిన్నావురా…’ అనడిగేది. పుసుక్కున తినలేదంటే పాపమే.. ‘పోరనికి ఇంత అన్నం వెట్టుపొమ్మని’ నిద్రవొయ్న పెద్దమ్మను లేపేది. ఆయ్నకు నేనంటే అంతగనమిట్టం. ఎంతైనా ఒక్కరక్తం గదా? ఆ నిద్రమబ్బుల గూడ నేన్ తినేదాంక ఆయనకు దోసిన ముచ్చట జెప్పేది. సిన్నప్పుడు ఎంత కట్టవడ్డడో, తిండికి ఎంత తిప్పలవడ్డడో దినం జెప్పేది. నేన్ తప్పుదొవ్వ వట్టద్దు, మంచి ఉజ్జోగం జేస్కోవాల్నని ఆయన తపన. నాగ్గూడ అయిన ముచ్చటంటే పానం. ఓ రోజు గిట్లనే ఆఫీసులకెళ్లి వొయ్యేసరికి లేటయింది. పోవుడే లేటంటే అద్దరాత్రిల టీవీ సూసుడలవాటుండేదప్పట్ల. టీవీ జూసి, జూసి అటే నిద్రవొయ్యేది. టీవీ అట్లనే మొత్తుకునేది తెల్లారేదాంక. తెల్లారి పెద్దమ్మతోనో బాగోతం. ‘టీవీ బంజేయకుంట వంటె కరెంటు బిల్లు మీ అయ్య గడ్తార్ర’ అని కారడ్డమాడేది. ‘ఆ.. వాని దగ్గర కుచ్చులూగులాడుతున్నయి, వాడొచ్చి కడ్తడాగు’ అని ముసి ముసి నవ్వేది. నవ్వేది నవ్వుకుంటేనే దగ్గేది. పెద్దబాపు
నాటి ‘దీక్షా దివస్’.. ఓ యాది!
5
