నవంబర్ 8, 2025 11:54AMన పోస్ట్ చేయబడింది

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తయింది. ఈ నెల 11 రెండవ చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరపున తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ప్రచారం చేయనున్నారు. ఇందు కోసం ఆయన శనివారం (నవంబర్ 8) పట్నాకు వెళ్లారు. ఆయన బీహార్ లో రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
ఎన్డీఏకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన బీహార్ ఎన్నికల్లో మిత్రపక్షాల నేతలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ బీహార్ లో ప్రచారం చేయనున్నారు. ఎన్డీయేలో నిర్ణాయక శక్తిగా ఉన్న తెలుగుదేశం ఎన్డీఏ విజయం కోసం సహకరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కూడా ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు ప్రచారం చేసిన సంగతి విధితమే.
ఇప్పుడు బీహార్ లో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు కాకుండా లోకేష్ వెడుతున్నారు. కాగా బీహార్ ఎన్నికల ప్రచారం కోసం రెండు రోజుల పాటు ఆ రాష్ట్రానికి అందుబాటులో ఉన్న లోకేష్ పనిలో పనిగా పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. అలాగే పట్నాలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో కూడా పాల్గొంటారు. శనివారం సాయంత్రం ఈ భేటీలు జరుగుతున్నాయి. ఆ తరువాత ఆదివారం (నవంబర్ 9) పాట్నా లో ఎన్డీఏ కు మద్దతుగా మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడతారు. అదే రోజు మధ్యాహ్నం పాట్నా నుండి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు.
