నవంబర్ 3, 2025 5:04PMన పోస్ట్ చేయబడింది

లండన్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో సమావేశం. ఈ సందర్శనలో భాగంగా ఆయన బ్రిటన్లోని ప్రముఖ విద్యుత్ సరఫరా సంస్థ ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ క్రిస్ ఫిట్జ్జెరాల్డ్తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతి, విశాఖపట్నం వంటి నగరాల్లో నూతన సాంకేతికతతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, నియంత్రణ రంగాల్లో భాగస్వామ్యానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనానికి ప్రాధాన్యతనిస్తూ, 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, లక్ష్యాలను ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు వివరించారు.రాష్ట్రానికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
హిందుజా గ్రూప్ భారత చైర్మన్ అశోక్ హిందుజా, యూరప్ లోని హిందుజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, హిందుజా రెన్యువబుల్స్ ఫౌండర్ షోమ్ హిందుజాలతో సమావేశం నిర్వహించారు. హిందూజా గ్రూప్ తో ఏపీ ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకున్నారు. దశలవారీగా ఏపీలో రూ.20 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయం తీసుకున్నది.
రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసే అంశంపై ఒప్పందం జరిగింది. కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటు అంశంపై ఒప్పందం కుదిరింది.
