నవంబర్ 1, 2025 5:26PMన పోస్ట్ చేయబడింది

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నిక జరిగింది.. అన్ని పార్టీల దృష్టీ తెలుగుదేశం వైపే ఉంటుంది. విభజన తరువాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో క్రీయాశీల రాజకీయాలకు ఒకింత దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో నాయకత్వం లేకపోవడమే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకులంతా కారణాలతో తమ దారి తాము చూసుకున్నా.. పార్టీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా ఉండటంతో రాష్ట్రంలోని రాజకీయాలన్నీ తెలుగుదేశం క్యాడర్ మద్దతు కోసం ఎన్నికల సమయంలో అరెస్టులు ఉంటాయి. ఇసుమంతైనా భేషజానికి పోకుండా తెలుగుదేశం జెండా మోస్తుంటాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ సహా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ తెలుగుదేశం జెండా చేతబట్టి ప్రచారం చేయడాన్ని మనం చూశారు. ఇప్పుడు జూబ్లీహాల్స్ ఉప ఎన్నిక వేళ కూడా దాదాపు అదే పరిస్థితి. ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా తెలుగుదేశం అండ కోసం అర్రులు చాస్తున్నాయి.
తెలుగుదేశం ప్రాపకం పొందేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నామస్మరణ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కొన్ని రోజుల కిందట తన ప్రచారంలో ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. తన భర్త, దివంగత మాగంటి గోపీనాథ్ కు ఎన్టీఆర్ పితృ సమానులని చెప్పారు. అలాగే ఎన్టీఆర్ కూడా మాగంటిని పుత్ర వాత్సల్యంతో ఆదరించారని చెప్పారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో హైదరాబాద్ నడిబొడ్డున అంటే మైత్రీవనం వద్ద ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపన ప్రస్తావన తెచ్చారు. ఆయన విగ్రహాన్ని మైత్రీవనంలో ఏర్పాటు చేయించి తానే ఆవిష్కరిస్తానని చెప్పారు. దీనికి ప్రధాన కారణం జూబ్లీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎటుమెగ్గు చూపితే అటే విజయం వరిస్తుందన్న నమ్మకమే అని పరిశీలకులు అంటున్నారు.
ఇక తెలుగుదేశం విషయానికి వస్తే.. ఆ పార్టీ అధినాయకత్వం ఎన్డీయేతో పొత్తు నేపథ్యంలో బీజేపీకే మద్దతు క్యాడర్ కు ఇప్పటికే పిలుపునిచ్చింది. ఇలా ఏ విధంగా చూసుకున్నా.. తెలంగాణలో పార్టీలన్నీ తెలుగుదేశం భజన చేస్తున్నాయని చెప్పక తప్పదు.
