అక్టోబర్ 30, 2025 3:08PMన పోస్ట్ చేయబడింది
.webp)
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పేరు మీద లక్షల్లో లూటీ చేసిన సైబర్ క్రిమినల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఏకంగా మంత్రి లోకేష్ పేరుతో వాట్సాప్ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి.. బాధితులను బెదిరించి దాదాపు 54 లక్షల రూపాయలు లూటీ చేసిన నిందితులను సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు, సమాచారం మేరకు గతంలోనే రాజేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించి రాబట్టిన సమాచారం ఆధారంగా గురువారం (అక్టోబర్ 30) సాయి శ్రీనాథ్, సుమంత్ అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రి నారా లోకేష్ ఫోటోను తమ వాట్సాప్ డీపీగా పెట్టుకుని.. తాము ఎన్.ఆర్.లమని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న సాయి శ్రీనాథ్, సుమంత్ లపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మొత్తం 9 కేసులను పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ మరో నిందితుడు రాజేష్‌తో కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ. 2.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
