అక్టోబర్ 25, 2025 11:01AMన పోస్ట్ చేయబడింది

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. నిన్న మొన్నటి వరకూ సీట్ల సర్దుబాటు కొలిక్కి రాక ప్రచారంలో వెనుకబడిన మహాఘట్ బంధన్ ఇప్పుడు ఆ వ్యవహారం తేలడంతో ప్రచారాన్నిస్పీడప్ చేసింది. ఈ సారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మహాఘట్ బంధన్ కు చావో రేవోగా మారాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలంగా ఉందన్న అంచనాలతో ఎలాగైనా ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని మహాఘట్ బంధన్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. కూటమిలోని ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ లు గెలుపు అంచనాలతో సీట్ల విషయంలో ఒకింత పట్టుదల పోయినా.. చివరాఖరుకు ఒక అంగీకారానికి వచ్చాయి.
ఈ వ్యవహారం వల్ల ప్రచారంలో కొంత విలువైన సమయాన్ని మహాఘట్ బంధన్ కోల్పోయిందనే చెప్పాలి. ఇప్పుడు దానికి కవర్ చేసింది ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్యంగా మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్.. ప్రచారం చేస్తున్న తీరు ఆసక్తిగా ఉంది. అవినీతి రహిత పాలన అందజేయడమే కాకుండా.. అదేదో సినిమాలో హీరో వేషం ఒక్క ఛాన్స్ ప్లీజ్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తిరిగినట్లు.. తేజస్వీయాదవ్.. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను వేడుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే సర్కార్ ను ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇస్తున్నారు.
ఇక ప్రధాని మోడీని ఉద్దేశించి విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉన్న బీజేపీ మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కర్మాగారాలు ఏర్పాటు చేసి… బీహార్లో విజయం సాధించాలని చూస్తోందని విమర్శిస్తున్నారు.
నితీష్ కుమార్ ప్రభుత్వం 55 కుంభకోణాలకు ఆరోపించిన మోడీయే.. ఆయనపై చర్య తీసుకోకుండా ఆయన సర్కార్ కు మద్దతుగా నిలుస్తున్నారనీ, కుంభకోణాల సర్కార్ ను మళ్లీ గెలిపించమని కోరుతున్నారనీ ఆరోపిస్తున్నారు. గత ఆర్జేడీ హయాంలో నితీష్ సీఎం అన్న సంగతి తెలిసిందే. మోడీ అప్పుడు నితీష్ పై చేసిన విమర్శలను ప్రజలకు గుర్తు చేస్తూ ఓట్లు అడుగుతున్నారు. దేశంలో అత్యధిక నేర కార్యకలాపాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయని తేజస్వి ఆరోపిస్తున్నారు. తాను అర్ధ సత్యాలు, అబద్ధాలు చెప్పననీ, చేసేదే చెబుతా, చెప్పిందే చేస్తానని చెప్పాలి. ఇండియా (మహాఘట్ కూటమి బంధన్)ని గెలిపిస్తే.. తాను సీఎం అవుతాననీ, బీహార్ ను నేరరహిత రాష్ట్రం చేస్తానని చెబుతున్నారు. అలాగే రాష్ట్రానికి అవినీతి రహిత పాలన అందిస్తానని, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులరైజ్ ఇచ్చిన హామీ ఇచ్చారు.
