అక్టోబర్ 23, 2025 4:47PMన పోస్ట్ చేయబడింది

తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరో సారి సంచలన వ్యాఖ్యలతో వార్తలకెక్కారు. సొంత పార్టీ ఎంపీపైనే తీవ్ర ఆరోపణలు చేసి వివాదానికి తెరలేపారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఆయన చేసిన ఆరోపణలతో ఇరువురి మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. కాగా కొలికపూడి వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నారు. ఆయన తీరు అభ్యంతరకరంగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకీ జరిగిందేంటంటే.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేస్తూ కొలికపూడి తీవ్ర ఆరోపణలు చేశారు
. కేశినేని చిన్ని పార్టీ పదవులను అమ్ముకుంటూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. విజయవాడ ఎంపీ కేశినేని కార్యాలయంలో అవినీతి దందాను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తానని కొలికపూడి చెబుతున్నారు. ఇంతకీ ఆయన ఆరోపణ.. 2024 ఎన్నికలలో తిరువురూ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం టికెట్ కోసం కేశినేని చిన్ని తనను ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారంటూ కొలికపూడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే తాను మూడు దఫాలుగా 60లక్షల రూపాయల చొప్పున చిన్ని సొమ్ములు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. అంతే కాకుండా కేశినేని చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి 50లక్షల రూపాయలు తీసుకువెళ్లినట్లు నిజమే గెలవాలి అంటూ కొలికపూడి ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. తాను ఎప్పుడూ పార్టీ కోసం, ప్రజల కోసం తన జేబులో డబ్బులు ఖర్చు చేశానే తప్ప ఎన్నడూ ఎవరి వద్దనుంచీ పైసా తీసుకోలేదని చెప్పారు. ఎంపీ కేశినేని చిన్ని లేకపోతే నేనులేను అని చెప్పిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు చేస్తున్న విమర్శలకు ఆయనే సమాధానం చెప్పాలని చిన్ని అన్నారు. తాను ఏమిటో విజయవాడ ప్రజలకు తెలుసునన్న చిన్నికొలికపూడి వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటూ. ఇలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ కూడా కొలికపూడి వ్యవహారశైలి వివాదంగానే ఉందని పార్టీలు అంటున్నాయి. ఇప్పటికే పలుమార్లు హైకమాండ్ ఆయనను మందలించిందనీ, హెచ్చరించిందనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి. అయినా ఆయనలో మార్పు రావడం లేదని మండిపడుతున్నారు.
