అక్టోబర్ 21, 2025 2:59PMన పోస్ట్ చేయబడింది

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావడంతో బీజేపీ నేతలతో కలిసి వెళ్లి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పంపారు. నామినేషన్లకు నేటితో చివరి రోజు ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు స్వీకరించనున్నారు.
చివరి రోజు భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మొత్తం 94 మంది 127 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి 2 సెట్ల నామినేషన్‌ను అభ్యర్థి నవీన్ యాదవ్ వేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్ వేశారు. అటు బీఆర్ఎస్ నుండి పి. విష్ణువర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్ వేశారు.
జూబ్లీహిల్స్ బైపోల్ లో రానున్న శాసన సభ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే అభ్యర్థులు మాగంటి సునీత, నవీన్ యాదవ్, లంకల దీపక్ రెడ్డి విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. డివిజన్లలో క్షేత్ర స్థాయిలో ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్నారు. ప్రత్యర్థుల మధ్య పోటాపోటీ ఉండటంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ రోజురోజుకి పెరుగుతుంది.
