అక్టోబర్ 18, 2025 5:01AMన పోస్ట్ చేయబడింది

దేశంలో మావోయిస్టు తీవ్రవాదం చరమాంకంలో ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ముందుగా చెప్పినట్లుగానే వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్ నక్సల్ విముక్త దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ కు మావోయిస్టు తీవ్రవాద పీడ పూర్తిగా తొలగిపోతుందన్నారు. ఢిల్లీలో శుక్రవారం (అక్టోబర్ 17) జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్లో మోడీ మాట్లాడారు. దశాబ్దాలుగా దేశ అభివృద్ధికి మావోయిజం శాపంగా మారిందన్న ఆయన.. గత కొన్నేళ్లుగా దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి శకం మొదలై ఉంది. ఈ ఫలితమే.. కేవలం 72 గంటల వ్యవధిలో 303 మంది మావోయిస్టుల లొంగుబాటు అని మోడీ పేర్కొన్నారు. వారంతా ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని విశ్వసించి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమయ్యారని వివరించారు.
గత కాంగ్రెస్ హయాంలో ‘అర్బన్ నక్సల్ మావోయిస్టుల ఘోరాలను కప్పిపుచ్చారన్న ప్రధాని.. ఇటీవల మావోయిస్టు బాధితులు ఢిల్లీకి వచ్చి తమ గోడును వినిపించుకోవడానికి ఏడు రోజుల పాటు ప్రయత్నించారని, కొందరు కాళ్లు, చేతులు కోల్పోయిన పేద రైతులు, గిరిజనులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తమ గొంతును ప్రజలకు చేర్చుకున్నారని గుర్తుచేశారు. 50 ఏళ్లుగా మావోయిస్టుల దాడుల వల్ల ఎన్నో మారుమూల ప్రాంతాల పాఠశాలలు, ఆసుపత్రులు, కనీస మౌలిక సదుపాయాలు పోయాయని అన్నారు.
ఒకప్పుడు దేశంలో 125 జిల్లాలలో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేదని, ఇప్పుడు వారి ప్రాబల్యం కేవలం 11 జిల్లాలకు పరిమితమైందన్న మోడీ.. వాటిలో కూడా మావోయిస్టుల బలం ఎక్కువగా ఉన్న జిల్లాలు మూడంటే మూడేనని చెప్పారు. అభివృద్ధి, ప్రధాని భద్రత తమ ప్రభుత్వానికి సమ ప్రాధాన్యతలన్న మోడీ మావోయిస్టుల కంచుకోట బస్తర్లో గిరిజనులు ఇప్పుడు ‘బస్తర్ ఒలింపిక్స్’ నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక పునరుజ్జీవనానికి నిదర్శనంగా అభివర్ణించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ఈఏడాది దీపావళిని ప్రజలు నిర్భయంగా, ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకుంటారని మోడీ అన్నారు.
