అక్టోబర్ 17, 2025 3:30PMన పోస్ట్ చేయబడింది
.webp)
చతిస్ గఢ్ సీఎం ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, చంద్రబాబు నాయుడు పై అలిపిరిలో జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో కీలక పాత్రధారి, సూత్రధారి తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నఅలియాస్ రూపేష్ లొంగిపోయాడు. ఆయనతో పాటు 208 మంది లొంగిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మావోయిస్టు అగ్రనేత ఆశన్న అలియాస్ రూపేష్ లొంగుబాటు చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటుగా చెప్పవచ్చు.
దేశ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఇదో కీలక మలుపు అంటున్నారు విశ్లేషకులు. దశాబ్దాలుగా అడవుల్లో ఆయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్.. తన అనుచరులతో కలిసి చత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ సాయి సమక్షంలో లొంగిపోయాడు. గన్ను వదిలి రాజ్యాంగాన్ని చేపట్టడానికి మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు ఆశన్న నిర్ణయించుకోవడం మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బగా చెబుతున్నారు. వనం వదిలి ఆయన జనం బాట పట్టారు. ఆయనతో కలిసి మొత్తం 208 మంది మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో మహిళలు 110 మంది, పురుషులు 98 మంది ఉన్నారు. లొంగిపోయిన వారు 153 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. వీరందరిపై కలిపి సుమారు 8 కోట్ల రూపాయల రివార్డు ఉందని అధికారులు గుర్తించారు.
ఇలా ఉండగా తన లొంగుబాటు సందర్భంగా ప్రసంగించిన ఆశన్న.. తమది లొంగుబాటు కాదని చెప్పారు. తాము జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఆయన తన సహచరులను ఉద్దేశించి చేసిన ప్రసంగం హృద్యంగా ఉంది. అనివార్య పరిస్థితుల్లో ఆయుధాలను వదిలిపెడుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగడం సాధ్యం కాదు. ఎవరికి వారే తమ రక్షణ కోసం ఇప్పుడు పోరాటం చేసుకోవాలి. ఆయుధాలను వదిలిపెడుతున్నాం కానీ మన పంథాను మరచిపోవడం లేదు, జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామనే ఆశతో ఉద్ఘాటించారు. సహచరులంతా ఎక్కడ ఉన్నారో అక్కడే లొంగిపోవడం మంచిదని సూచించారు. ఎవరైనా లొంగిపోదామని భావిస్తే తనను సంప్రదించాలన్నారు. ఇది లొంగుబాటు కాదు, జనజీవన స్రవంతిలో కలవడమన్న మాటను ప్రభుత్వం కూడా అంగీకరించిందని చెప్పిన ఆశన్న.. ఉద్యమంలో అమరులైన సహచరులకు ఆయన ఈ సందర్భంగా జోహార్లు చెప్పారు. ఆయన ప్రసంగం విన్న మావోయిస్టు క్యాడర్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నారనీ, ఆ తరువాత వారి కళ్లు చెమ్మగిల్లాయని అక్కడున్న అధికారులు తెలిపారు. ఆయన మాటలు విన్న మావోయిస్టు కేడర్లు క్షణకాలం నిశ్శబ్దంగా నిలబడి కంటతడి పెట్టారని అక్కడున్న అధికారులు తెలిపారు.
ఇలా ఉండగా శుక్రవారం ఛత్తీస్ గఢ్ సీఎం సమక్షంలో ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన మావోయిస్టులలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ రూపేష్, కేంద్ర కమిటీ సభ్యుడు రాజ్ మాన్ మండవి, సెంట్రల్ జోన్ కమిటీ సభ్యులు సలాం, వెట్టి అలియాస్ సంతు, సీనియర్ డివిజనల్ కమాండర్ రతన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇంత పెద్ద స్థాయిలో ఒకేసారి కేంద్ర, జోన్, రీజనల్ స్థాయి నాయకులు లొంగిపోవడం భారత మావోయిస్టు చరిత్రలో ఇదే తొలిసారి.
.webp)
కాగా ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, ఇది శాంతి పథకానికి గొప్పగా అభివర్ణించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాస సౌకర్యాలు, జీవనోపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. భారత మావోయిస్టు ఉద్యమంలో ఒకే సారి రెండు వందల మందికి పైగా లొంగిపోవడం ఇదే మొదటిసారన్న ఆయన.. ఇది కేవలం ఒక సాంఘిక పరిణామం మాత్రమే కాదు, దశాబ్దాలుగా సాగుతున్న హింసా మార్గానికి ముగింపు సంకేతమని చెప్పారు. రూపేష్ లొంగుబాటు దేశ మావోయిస్టు ఉద్యమానికి కొత్త దశను తెరిచింది. “ఇది లొంగుబాటు కాదు — ప్రజలతో కలిసిపోవడం” అనే రూపేష్ మాటలు ప్రస్తుతం చత్తీస్గఢ్ అడవుల్లో మారుమ్రోగు తున్నాయి.ఈ పరిణామం శాంతి వైపు మావోయిస్టు ఉద్యమం మెల్లగా మలుపు తీసుకు టున్న సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
